ఇంతకు మునుపే ఎదిగిన వారి జీవితం కోసం తెలుసుకోవడంలో పెద్దగా ఏమి ఆసక్తి ఉండదు. కాని అదే ఎదుగుతున్న వారి గురించి తెలుసు కోవడంలోనే మజా ఉంటుంది. ఎలాగంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చూస్తే బాగుంటుంది కాని అయిపోయిన మ్యాచ్ చూస్తే ఏమి తోచదు మనకి. అటువంటివే కొందరు వ్యక్తులు,వారి జీవితాలు. ఇవి పూర్తిగా నా వ్యక్తిగత జీవితానుభవాలు మాత్రామే..(ఇది నా సొంత సొద మాత్రమే) కేవలం జ్ఞాపకాలను జ్ఞాపకాలుగానే వదిలేయడం నాకు ఇష్టం లేక నేను ఇలా నా బ్లాగులో రాసేందుకు సిద్ధమయ్యాను. నా జీవితం ఒక తెరచిన పుస్తకం లాగా తేటతెల్లంగా ఉండాలను కుంటున్నాను. అందుకే నా ఈ చిన్న ప్రయత్నం.
అమ్మ పేరు నూకరత్నం , నాన్న పేరు సత్యనారాయణ, నా కంటే ముందు వయసులో పెద్దదైన ఒక అక్క ఉంది. తన పేరు దేవి. నా స్వస్థలం విశాఖ జిల్లాలోని తుని ప్రక్కన ఉండే పాయకరావు పేట. అమ్మ వాళ్ళ ఊరు. నాన్నది అన్నవరం ప్రక్కన చిన్నయపాలెం. నేను 07-10-1989 లో పాయకరావు పేటలోనే జన్మించాను. కాని తేదీలో చాలా పొరబాట్లు ఉన్నాయి, ఆఖరికి ఎలాగైతేనే నేనే సరిగ్గా కనుక్కున్నాను.నేను పుట్టినపుడు ఊరిలో వరదలు అని అమ్మ చెబుతూ ఉండేది.అలాగే నా పేరులో కూడా చాలా confusions ఉన్నాయి. నాకు పెట్టిన పేరు శ్రీనివాస్.. ఇంటి పేరుతో చేర్చి తెప్పల శ్రీనివాస్. మా నాన్న ఏమో నా పేరు చివర్లో 'కోట' అని కొత్తగా చేర్చారు.(మా తాత పేరు 'కోటయ్య'). ఆఖరికి ఆ పేరు అందరూ కోట శ్రీనివాస రావు అనే స్థాయికి వెళ్ళిపోయింది.అలాగే మా నాన్న చేసిన ఈ వెధవ పని వలన మొదట్నుంచి మళ్ళీ అన్ని సర్టిఫికేట్లలో నా పేరు చివర కోట అని మార్చుకోవాల్సి వచ్చింది. నాకు అసలు బొత్తిగా మింగుడు పడని విషయం అది. అమ్మకు కూడా మొదట్లో మా నాన్న ఇలా చేసాడని అసలు తెలియదు.. ఏమి చేస్తాం ఇక ఆ పేరుతో బయట నా తిప్పలేవో నేను పడ్డాను మరి.
అలాగే నేను ఇంట్లో పుట్టానన్న కారణం వలన ఆఖరికి బర్త్ సర్టిఫికేట్ కూడా తీయలేదు. ఇన్ని ట్రాజెడీల మధ్య ప్రారంభమయింది మన జీవితం మరి. ఏంచేస్తాం ఇది కూడా మా నాన్న చలవే మరి.
