Sunday, December 23, 2012

ట్యూషన్ లో

చిన్నపుడు మా శివ అన్నయ్య  మిత్రుడు భాస్కర్ అన్నయ్య దగ్గర  ట్యూషన్  కి వెళ్లేవాణ్ణి. అయన చాలా బాగా లెక్కలు చెప్పేవాడు. దానికితోడు నేను అయన చెప్పిన దానికి  అనుగుణంగా చదవడంతో  4 వ క్లాస్  చదివేటప్పుడే 6 వ క్లాస్ లెక్కలు నేను సాల్వ్ చేసేవాణ్ణి. దానితో పాపం 6 వ క్లాసు చదివే వాళ్లకి  నా వల్ల  దెబ్బలు పడేవి. చిన్నవాడు వాడే వేస్తున్నాడు చదివే మీరు ఎందుకు లెక్కలు వేస్తాలేదు అని అయన చిడక బాదేవారు .

ఆయన  ప్రోత్సహంతో  నేను ఆరవ తరగతి కి పరీక్ష  రాద్దామనుకున్నా కాని వీలుపడలేదు.
ట్యూషన్ లో ఆగస్టు 15న సార్ కొన్ని పోటీలు పెట్టారు.అందులో ఒక నిమిషంలో తెలిసిన సినిమా పేర్లు చెప్పడం, జనరల్ నాలెడ్జ్, కుర్చీల ఆట పెట్టారు. నేను శినిమా పేర్లు చెప్పే పోటీలో మాత్రం గెలిచాను..ఎందుకంటే ముందునుంచి మనకు బాగా సినిమాల పిచ్చి

ఒకరోజు మా శివ అన్నయ్యను పిలిపించారు. మీ వాడు ఎప్పుడు శ్రీనివాస్ అని సంతకం పెడుతున్నాడు. సర్టిఫికెట్లలో శ్రీనివాసు కోట అని ఉంది అన్నారు.. ఇంక అప్పుడు నుండే నా పేరు చివరన కోట అని చేరిపోయింది...అప్పటి నుండే  నా పేరుతో నా తిప్పలేవో నేను పడుతు వచ్చాను. ఆఖరికి పేరు మార్చేందుకు వీలుపడలేదు నాకు.

పాయకరావుపేట పాఠశాల















ఇది ఇప్పటి  మా  బడి ..2009 లో పాయకరావు పేట  వచ్చినపుడు  తీసిన  చిత్రం . చిన్నప్పటి  నుండి  బాగా చదవడంతో అందరూ  నాతో బాగా  కలుపుగోలుగా  ఉండేవారు . మా శివ  అన్నయ్య  నన్ను ఇందులో చేర్పించారు.
వెనుక భాగం చాలా ఖాళీ స్థలం  ఉండేది . అందరం ఇంటర్వెల్ లో ఆడుకొనేవాళ్లం. మధ్యాహ్నం  ఓ 3 గంటలకు  బడి ముగిసేది. బడి ముగియగానే స్నేహితులమంతా  కలిసి  ఆడుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం . అప్పుడు మాకు క్రికెట్ పెద్దగా తెలియదు. మేమంతా కలిసి గూటి బిళ్ల, ఏడు పెంకులు, వీపుసాపులు  ఆడేవాళ్లం. నేను చిన్నపుడు చాలా లావుగా బొద్దుగా ఉండడంతో అందరూ నన్ను ఆట pఅట్టించేవారు. క్లాసులో టీచర్లు  లేనపుడు అంతా  పుస్తకాలలోకాగితాలు పెట్టి అడుకోనేవాళ్ళం . నేను క్లాసు లీడరుగా  ఉండేవాణ్ణి. భలే సరదా సరదాగా సాగిపోయిది బాల్యపు  జీవితం .


చిన్నపుడు అన్ని చేసేవాణ్ణి. అల్లరి చెయ్యడం,చదవడం, చిన్నపుడే క్లాసులో అమ్మాయిలను ఆటపట్టించడం అన్ని చేసేవాణ్ణి.
ఒకసారి అయితే ఆ వయసులోనే లవ్ లెటర్ రాసి కింద మా ఫ్రెండు పూర్ణాగాడి పేరు రాసి వాడు ఇచ్చాడు అని ఒక అమ్మాయికి ఇచ్చి రియక్షన్ ఎలా ఉంటుంది అని చూసా.. పాపం బడికి వచ్చి రాగానే అమ్మాయిలంతా వాడిని చిదక బాధారు పాపం..

అలాగే ఒకసారి ఉదయం ప్రార్ధన జరిగేటప్పుడు ఎవ్వరు ప్రతిజ్ఞ చెప్పేందుకు  ముందుకు రాలేదు. అప్పుడు మా హెడ్ మాస్టారు మీలో ధైర్యంగా  చెప్పే మగాడెలేడా అన్నారు.అందుకు నేను పెద్ద పుడింగిలా వెళ్లి ప్రతిజ్ఞ చెప్పాను.అది తలచుకుంటే ఇప్పటికి నవ్వు వస్తుంది.

ఇంకోసారి అయితే మా ఫ్రెండు తమ్ముణ్ణి ఒకడు కొట్టడని నాతో చెప్పగా నేనేదొ పెద్ద ఇదిలా వాణ్ణి చిదక బాదాను. అంటే ఆ వయసులోనే నేనొక గ్యాంగ్ నే మెయింటెన్ చేశాను.


ఒకసారి మా సుధాకర్ మాస్టారు అమెరికాలో ఉన్న వాళ్ల అక్క కూతురు ఒక అమ్మాయిని బడికి తీసుకువచ్చాడు.ఆ అమ్మాయి కొన్ని ఫజిల్స్ ఇచ్చి బోర్డులో రాయమంటే అంతా తలలు పట్టుకున్నారు..నేను వెళ్లి వాటిని పూర్తి చేసాను.. దానితో ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని  యు ఆర్ ది విన్నర్ అని అంది.. బడి ముగియగానే ఫ్రెండ్స్ అంతా పర్వాలేదే ఆ అమ్మాయి  చెయి  అందుకున్నావు అన్నారు..ఇది అంతా నేను 4 క్లాస్ చదివేటప్పుడే జరిగింది.

ఎన్నెన్నో చిలిపి పనులు చిన్న  చిన్న తగాదాలు  ఎంతో ఆనందంగా గడిచిపోయింది. జీవితం


Wednesday, July 25, 2012

పాయకరావుపేట పాఠశాలలో

















           పెద్దమ్మ నన్ను ఊరి నుండి తీసుకువచ్చి పాయకరావుపేట లోని ఈ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చేర్పించించింది. పాయకరావుపేట అనేది విశాఖజిల్లా పరిధిలోకి వస్తుంది. చెన్నై నుండి వచ్చాక మా అన్నయ్య సాయంతో ఇక్కడ బడిలో చేరాను..ఏలూరిలో రెండవ తరగతి వరకు చదవడంతో ఇక్కడ నన్ను మూడవ తరగతిలో చేర్చారు.  చెరే ముందు నా చేతికి తెలుగు పుస్తకమొకటి ఇచ్చి చదవమన్నారు. నేను వేగంగా చదవడంతో సరే ఇక చాలు రేపటి నుంచి జాయిన్ అవ్వమని చెప్పారు. కాని అన్నయ్య ఏమో నన్ను అక్కడే ఉండు అని వదిలేసి వెళ్లాడు. చేరిన మొదటిలో చాలా భయపడే వాణ్ణి ఎందుకంటే అమ్మను నాకు  తెలిసి ఎక్కువ రోజులు విడిచి ఉండాలనే తలంపు ఒక ప్రక్క, కొత్త వాతావరణంలో త్వరగా కలవలేని తత్వం నాది.దానితో చాలా భాధ పడేవాణ్ణి. నెమ్మదిగా ఒక్కొక్కరు స్నేహితులయ్యారు. బడిలో నా స్నేహితులంటే ముఖ్యంగా గుడివాడ వీరబాబు,సూరిబాబు,పూర్ణచందర్, ఎర్రా వేణుగోపాల్,వర్రె నూకరాజు, వైదాడి ప్రసాద్...నా క్లాసుమేట్స్ ఏమో ఏడిద చిన్నబ్బాయి,కొత్తేల గౌరిదేవి,లోవరాజు, శ్రీను,విజయ,దేవి,కాకినాడ దేవి,దుర్గారావ్ అని ఉండేవారు. వెళ్లిన కొత్తలోనే నేను బాగా చదువుతున్నానే అభిప్రాయంతో అధ్యాపకులందరూ నాతో చనువుగా వుండే వారు. పైగా నేను చెన్నైలో ఉండడం వలన తెలుగు పదాలకు అర్ధాలు అడిగేవారు తమిళంలో. 




          నాకు సరిగ్గా గుర్తులేదు కాని.. నాకు తెలిసి అక్కడ ప్రకాశం మాస్టారు ఉండేవారు ఆయన చాలా బాగా లెక్కలు చెప్పేవారు.చండశాసనుడు అయితే.నేను చెరిన ఏడాదే ఆయన రిటారైనారు. తర్వత సుధాకర్ మాష్టారు, నాగమణి మేడం,రాఘవేంద్ర మాష్టరు, రాజు మాష్టరు ఉండే వారు. ఊరి బడి కావదంతో మాతో ప్రతి పని చేయించుకొనేవారు.. సుధాకర్ మాష్టరు అయితే అక్కడ పిల్లలతో తన హీరోహోండా బండి తుడిపించేవాడు. నాగమణి మేడం అయితే పిల్లల పెరటి నుండి కూరగాయలు తెప్పించేది. ఉన్న దాంట్లో రాఘవేంద్ర మాష్టరు చాలా మంచి వారు. 


          చిన్నప్పటి నుంచి నాకు వెటకారం, జోకులు వెయ్యడం ఎక్కువ, కాని కొద్దిపాటి పరిచయం ఉన్న వాళ్ల దగ్గర కాని, పెద్దవాళ్ల దగ్గ్ర కాని ముఖ్యంగా మా శివన్నయ్య దగ్గర కాని చాలా మౌనం పాటిస్తాను.. బడిలో వరకు నేనెప్పుడు రాముడు మంచి బాలుడు అనే విధంగా నడుచుకొనేవాణ్ణి..   
       

Tuesday, July 10, 2012

అమ్మను విడిచి వెళ్లిన క్షణం



అమ్మకు ఎందుకో క్షయ వ్యాధి సోకింది ఏలూరిలోనే..ఇక్కడ చెన్నై వచ్చాక అమ్మ దానికి తగిన మందులు వాడుతూ ఉంది..అక్కకూ నాకు కూడా ఊహా తెలియని వయసు అప్పుడు. రాత్రయితే అమ్మను గట్టిగా కావలించి పడుకొనే వాళ్లం ఇద్దరం.


           అదే సమయానికి ఊరి నుండి మా పెద్దమ్మ వచ్చింది.అప్పుడు ఆమే నన్ను చూసి ఇక్కడే వాడు ఇలా మీతో ఉండి పోతే వాడికి చదువు సంధ్యా అబ్బవు, వాణ్ణి నాతో పాటు ఊరికి తీసుకొనిపోయి చదివిస్తాను అంది. అసలు మా పెద్దమ్మకు అలా చెయ్యమని చెప్పిందే మా చిన్న అన్న్నయ్య శివ.అటుపిమ్మట అక్కేమో అమ్మ దగ్గరా, నేనేమో మా పెద్దమ్మ వాళ్ల్లింట్లో పెరిగాను. అమ్మ నెలకు నాకయ్యే ఖర్చులకి డబ్బులు పంపేది. నేను అక్కడే ఉండి చదవ నారంభించాను. అమ్మ క్షయ వ్యాధికి మందులు వాడడంతో నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. చిన్న వయసు ఏమో అమ్మని వదిలి ఉండడనికి మనసు ఎందుకో రోదించేది.అమ్మను వదిలి నేను తిరిగి పాయకరావ్ పేట వెల్లేటప్పటికి ఓ 8 ఏళ్లు ఉండవచ్చు బహుశ.

Friday, June 22, 2012

నా తల్లిదండ్రుల గురించి...




















ముందుగా  మా అమ్మ గురించే చెప్పాలనుకుంటున్నాను.. అమ్మ ఆ రోజుల్లో ఏడో తరగతి వరకే చదివింది. మా తాతయ్యకు ఆరుగురు సంతానం. మా అమ్మ ఇంటికి ఐదవ సంతానం. అప్పట్లో ఆడపిల్లలను బడికి పంపడమే అరుదుగా మరి. 


అమ్మకి అందరికి పంచే గుణం, దాతృత్వం ఎక్కువే మొదట్నుంచి. ఉన్న దానితో సర్దుకుపోయే తత్వం తనది. తనపై ఇసుమంతా ప్రేమ చూపినా పొంగిపోయి విపరీతంగా ఆదరిస్తుంది. ఏ పని చేసినా చాలా శ్రద్దతో బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఎవరి తోనూ మాటపడే తత్వం కాదు తనది. చాలా సాదాసీదాగా ఉంటుంది. క్రమశిక్షణకు, కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుంది. సొంతవారిని అందరిని చేరదీసింది. కష్టించే తత్వం తనది.


అమ్మ వ్యవహార శైలిలో బలం బలహీనతలు రెండు చోటు చేసుకున్నాయి.
అందులో మొదటిది కుటుంబంలోని బంధువులను అతిగా నమ్మడం. ఎవరు ఏమన్నా నమ్మే తత్వం.
ప్రతి విషయంలో వారాలు వజ్యలు అంటూ వాదిస్తుండడం
ముక్కుసూటిగా పోయే తత్వం చాలా సార్లు కొంప ముంచాయి.
చెప్పిన విషయాన్నే మళ్లి మళ్లి చెప్పడం.  
కొన్ని చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం. ఒక్కోసారి అతిగా కోప్పడడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు 


మా నాన్న గురించి :
ఆయనలో  అణువంతయినా మంచితనం నేనిప్పుడు చూడలేదు. అయన కోసం చెప్పేందుకు  కూడా  మాటలు చాలవు. అటువంటి  వ్యక్తీ కోసం చెప్పిన వ్యర్ధమే. నిజంగా ఆయనంతా నీచుణ్ణి  వల వేసిన పట్టలేము ..అమ్మను ఎంతగానో భాధ  పెట్టాడు. ఆయనది విపరీతమైన శాడిజం . ఏ  రోజు  మాతో ప్రేమగా ఆప్యాయంగా వ్యవహరించింది కూడా లేదు. ఆయన  నిలువెల్లా విషం .  బిడ్డల దగ్గరే స్వార్ధం చూపే నైజం తనది.  తనకు  తెలిసిందల్లా  తను సంతోషంగా ,తృప్తిగా  వుంటే చాలు . కన్న బిడ్డలు బాగున్నా  చూడలేని తత్త్వం . ఎదుటవారు సంతోషంగా ఉంటే ఓర్వలేని గుణం ..జల్సాలకైన  డబ్బు  వెచ్చిస్తాడు . కానీ ఎవరికీ పెట్టే  బుద్ది  లేదు . తను చేసిందే, చెప్పిందే  న్యాయం . తను తప్ప అందరు వెధవలే అని ఎవ్వరిని లెక్కచెయ్యని  తత్త్వం.ఎదుటవారిలో  తప్పులను  మాత్రం  లెక్కించి తన తప్పులను  మాత్రం మరిచే  గురివింద  నైజం తనది.అసత్యం , అహం , ఆడంబరం ,డాంబికం, స్వార్ధం ,వ్యసనపరుడు ,అసూయ ,శాడిజం  ఇంతే మా నాన్న గురించి. 



మా అమ్మ  ఓర్పుకి  నిజంగా చెయ్యెత్తి  మొక్కాలి , ఆయనతో  సంసారం  చేసి  మమ్మల్ని  పెంచి పెద్ద చేసి  విద్యాబుద్ధులు నేర్పినందుకు .

Wednesday, May 30, 2012

తొలి దీపావళి చెన్నైలో




























ఆడుతూ పాడుతూ సాగిపోయిది జీవనం. అక్కతో ఎందుకో ఏ రోజు పెద్దగా కలిసి ఉండింది లేదుగాని. ఎప్పుడూ మా పిన్ని వాళ్ల కూతుళ్లు, నా చెల్లిళ్ళతో మాత్రం కలిసి తెగ తిరిగేవాణ్ణి. ఎక్కడకు వెల్లినా మేమొక జట్టుగా ఉండేవాళ్లం. మా పెద్ద చెల్లి పేరు రోజ, చిన్న చెల్లి పేరు విజయ. మొదటి నుంచి నాకు చిన్న చెల్లి అంటేనే ఇష్టం.


మేము మద్రాస్ వచ్చిన మొదటి దీపావళి నాకు బాగా గుర్తు మా నాన్న అప్పుడు అయ్యప్ప మాల వేసి వున్నాడు. అంతకు ముందే హుండీలో డబ్బులు దాచేవాడు. దీఫావళికి అందరూ టపాకాయలు పేలూస్తూ ఉన్నారు అక్కడ అంతా. నేను మాత్రం సాధారణంగానే కూర్చోని అందరూ  కాలుస్తుంటే చూస్తూన్నాను. తరువాత అమ్మ ఏవో కొన్ని టపాకాయలు కొనింది.అవి చాలా తక్కువ అనిపించింది నాకు. అందరూ కలుస్తున్నారు నేను తప్ప. చెల్లి వాళ్లు కూడా కాలుస్తూ కనబడ్డారు. ఆ సమయం నాకు అదొక హేళనగా అనిపించింది. వెంటనే నాన్న హుండీలో దాస్తున్న డబ్బులు మెల్లగా దొంగిలించాను. కాని మా అన్నయ్య అది భయట పెట్ట్డంతో నాన్న నన్ను చావబాదాడు. ఆ రోజు నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మ ఏమో పండగ రోజున పాపం ఎందుకు వాణ్ణి కొట్టడం అని వారించింది. ఇంతకు నేను ఆ హుండీ నుండి తీసింది 25 రూపాయలు మాత్రమే తెలుసా?  

చెన్నైలో నా తొలి గురువు


ఖాళీగా ఉంటే ఎప్పుడూ అక్కా,నేను దెబ్బలాడుకుంటున్నాం అని అమ్మ తనకు తెలిసిన టైలర్ దగ్గర పనికి పెట్టింది.నేను చిన్నప్పుడు చాలా ఆక్టివ్ గా ఉండేవాణ్ణి. అన్నట్లు ఆ టైలర్ షాపు పేరు ఫ్యామస్ టైలర్. నేనేమో మొదట్లో తమిళ భాష రాక తెగ భయపడేవాణ్ణి. నాకు తెలిసి ఒక మోస్తారుగా తమిళ భాష నేర్చుకొనేందుకు ఒక 2 నెలల సమయం మాత్రమే పట్టింది.


ఆ టైలర్ ఒక ముదుసలి వ్యక్తి ఆయనకు ఒక 50 ఏండ్లు ఉంటాయి బహుశా అప్పటికి.ఆయన పేరు గోపాల్.ఆయన కుటుంబం చాలా పెద్దది.నిజంగా ఉమ్మడి కుటుంబం అంటే అలాగే ఉండాలనేంతగా ఉంటుంది. ఆయనకు ఒక పెద్ద సొంత ఇల్లు. నన్ను ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలుపుగోలుగా చూసుకొనేవారు. నేను అక్కడ చిన్న చిన్న పనులు చేసి పెట్టే వాణ్ణి, అంటే  మిషను తుడవడం,చేతిపనులు చెయ్యడం, దారాలు గట్రా కొనితేవడం వంటి పనులు చేసేవాణ్ణి.


గోపాల్ ఆయన అరవ తెలుగు వాడు, నాతో చాలా మటుకు తెలుగులోనే మాట్లాడేవాడు.ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎంతో శ్రమజీవి.అంత వయసులోను తన పనులు తనే చేసుకొనేవాడు. నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పట్లో రోజు పని చేస్తే అర్ధ రూపాయి ఇచ్చేవాడు. వారం వారం ఒక 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ అర్ధ రూపాయి నేను తీసుకొని అమ్మకు ఆ 20 రూపాయిలను ఇచ్చివేసేవాణ్ణి.  

ఆదివారమైతే వాళ్ల ఇంట్లోనే ఉండేవాణ్ణి. ప్రతి వారం అప్పటికి దూరదదర్శన్   లో ప్రసారమయ్యే శక్తిమాన్ ధారావాహిక అంటే పడి చచ్చేవాన్ని, నేనే కాదూ నా లాంటి చిన్న పిల్లలందరు కూడాను. కేవలం దానికోసమే అప్పట్లో పార్లేజి బిస్కెట్లు కొని శక్తిమాన్ స్టిక్కర్లను పదిలంగా దాచుకొనేవాన్ని కూడాను.