Wednesday, May 30, 2012

తొలి దీపావళి చెన్నైలో




























ఆడుతూ పాడుతూ సాగిపోయిది జీవనం. అక్కతో ఎందుకో ఏ రోజు పెద్దగా కలిసి ఉండింది లేదుగాని. ఎప్పుడూ మా పిన్ని వాళ్ల కూతుళ్లు, నా చెల్లిళ్ళతో మాత్రం కలిసి తెగ తిరిగేవాణ్ణి. ఎక్కడకు వెల్లినా మేమొక జట్టుగా ఉండేవాళ్లం. మా పెద్ద చెల్లి పేరు రోజ, చిన్న చెల్లి పేరు విజయ. మొదటి నుంచి నాకు చిన్న చెల్లి అంటేనే ఇష్టం.


మేము మద్రాస్ వచ్చిన మొదటి దీపావళి నాకు బాగా గుర్తు మా నాన్న అప్పుడు అయ్యప్ప మాల వేసి వున్నాడు. అంతకు ముందే హుండీలో డబ్బులు దాచేవాడు. దీఫావళికి అందరూ టపాకాయలు పేలూస్తూ ఉన్నారు అక్కడ అంతా. నేను మాత్రం సాధారణంగానే కూర్చోని అందరూ  కాలుస్తుంటే చూస్తూన్నాను. తరువాత అమ్మ ఏవో కొన్ని టపాకాయలు కొనింది.అవి చాలా తక్కువ అనిపించింది నాకు. అందరూ కలుస్తున్నారు నేను తప్ప. చెల్లి వాళ్లు కూడా కాలుస్తూ కనబడ్డారు. ఆ సమయం నాకు అదొక హేళనగా అనిపించింది. వెంటనే నాన్న హుండీలో దాస్తున్న డబ్బులు మెల్లగా దొంగిలించాను. కాని మా అన్నయ్య అది భయట పెట్ట్డంతో నాన్న నన్ను చావబాదాడు. ఆ రోజు నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మ ఏమో పండగ రోజున పాపం ఎందుకు వాణ్ణి కొట్టడం అని వారించింది. ఇంతకు నేను ఆ హుండీ నుండి తీసింది 25 రూపాయలు మాత్రమే తెలుసా?  

చెన్నైలో నా తొలి గురువు


ఖాళీగా ఉంటే ఎప్పుడూ అక్కా,నేను దెబ్బలాడుకుంటున్నాం అని అమ్మ తనకు తెలిసిన టైలర్ దగ్గర పనికి పెట్టింది.నేను చిన్నప్పుడు చాలా ఆక్టివ్ గా ఉండేవాణ్ణి. అన్నట్లు ఆ టైలర్ షాపు పేరు ఫ్యామస్ టైలర్. నేనేమో మొదట్లో తమిళ భాష రాక తెగ భయపడేవాణ్ణి. నాకు తెలిసి ఒక మోస్తారుగా తమిళ భాష నేర్చుకొనేందుకు ఒక 2 నెలల సమయం మాత్రమే పట్టింది.


ఆ టైలర్ ఒక ముదుసలి వ్యక్తి ఆయనకు ఒక 50 ఏండ్లు ఉంటాయి బహుశా అప్పటికి.ఆయన పేరు గోపాల్.ఆయన కుటుంబం చాలా పెద్దది.నిజంగా ఉమ్మడి కుటుంబం అంటే అలాగే ఉండాలనేంతగా ఉంటుంది. ఆయనకు ఒక పెద్ద సొంత ఇల్లు. నన్ను ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలుపుగోలుగా చూసుకొనేవారు. నేను అక్కడ చిన్న చిన్న పనులు చేసి పెట్టే వాణ్ణి, అంటే  మిషను తుడవడం,చేతిపనులు చెయ్యడం, దారాలు గట్రా కొనితేవడం వంటి పనులు చేసేవాణ్ణి.


గోపాల్ ఆయన అరవ తెలుగు వాడు, నాతో చాలా మటుకు తెలుగులోనే మాట్లాడేవాడు.ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎంతో శ్రమజీవి.అంత వయసులోను తన పనులు తనే చేసుకొనేవాడు. నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పట్లో రోజు పని చేస్తే అర్ధ రూపాయి ఇచ్చేవాడు. వారం వారం ఒక 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ అర్ధ రూపాయి నేను తీసుకొని అమ్మకు ఆ 20 రూపాయిలను ఇచ్చివేసేవాణ్ణి.  

ఆదివారమైతే వాళ్ల ఇంట్లోనే ఉండేవాణ్ణి. ప్రతి వారం అప్పటికి దూరదదర్శన్   లో ప్రసారమయ్యే శక్తిమాన్ ధారావాహిక అంటే పడి చచ్చేవాన్ని, నేనే కాదూ నా లాంటి చిన్న పిల్లలందరు కూడాను. కేవలం దానికోసమే అప్పట్లో పార్లేజి బిస్కెట్లు కొని శక్తిమాన్ స్టిక్కర్లను పదిలంగా దాచుకొనేవాన్ని కూడాను.

Thursday, May 17, 2012

చెన్నై లో నా కొత్త జీవితం

నాకు ఊహ తెలిసి ఒక 1997-98 మధ్యలో చెన్నై వచ్చి జీవనం సాగించాం.. అప్పటికి ఒక లారీలో అన్ని సామాన్లతో మద్రాసులో అడుగు పెట్టాం. నాకు బాగా గుర్తు ఒక మేరీ మాత విగ్రహం ప్రక్కన సరిగ్గా  మేము ఆగాం.. అమ్మ పిన్ని కి ఫోన్ చేసి అక్కడి నుండి బయలుదేరాం. 
 
అక్కడ మొట్టమొదటగా  ఒక చిన్న రూములో అద్దెకు దిగాం. సరిగ్గా  అప్పుడు దాని అద్దె నెలకు 500. ఎవరైన ఇద్దరు వ్యక్తులు వస్తే మరొకరు ఇంటి బయట వేచి వుండాలి. ఏలాగైతేనేమి నాన్నకు మా చిన్నాన్న చేస్తున్న  షాపులోనే ఇస్త్రీ చేసేందుకు పని దొరికింది.


అన్నట్లు చెప్పడం మరిచా .. మేము ఏలూరులో ఉన్నప్పుడే అక్క చదువుపై ఆసక్తి లేకపోవడంతో తను మద్రాస్ లో ఇంటి పనికి కుదిరింది. తరువాత మేము చెన్నై చేరాక అక్కను అక్కడ నుండి పని మానిపించింది అమ్మ. కొద్ది రోజుల తరువాత అక్క తనే ఒక ఎక్సపోర్ట్  కంపెనిలో పనికి కుదిరింది..


ఇక నా విషయానికి వస్తే నేను చాలా చిన్న పిల్లవాడిని కావడం చేత నన్ను 'పాలవాడీ' అని చిన్న పిల్లలకై ఒక విద్యాకేంద్రం అది. నేను మా పిన్ని వాళ్ల కూతురు కలిసి అక్కడ కు వెల్లేవాళ్ళం. అక్కడ రకరకాల బొమ్మలు పెట్టి  కథలు అవి చెప్పి నిద్ర పుచ్చేవారు. నిద్ర లేవగానే ఒక పెద్ద సున్నుండను చేతికి ఇచ్చి పంపే వారు. నా మట్టుకైతే ఆ తెలియని వయసులో కేవలం ఆ సున్నుండల కోసమే అక్కడికి వెళ్లి  వచ్చే వాణ్ణి .


ఏలూరులో అయితే రెండో తరగతి వరకు చదువు సాగింది కాని ఇక్కడికి వచ్చాక అంత అరవ చదువులు కావడంతో నన్ను స్కూలుకు పంపేందుకు అమ్మ భయపడేది. పైగ తమిళ   పిల్లలు నన్ను కొట్టేస్తారేమో నని తెగ భయపడింది..దానితో చదువు అర్ధాంతరంగానే ఆగిపోయింది ఓ రెండేళ్ల వరకు.