Sunday, November 27, 2011

నా బాల్యం

అక్క  పేరు  దేవి అని ముందే చెప్పాను. అక్కకు మొదటి నుంచి చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. కనుక తన చదువు 5 వ తరగతి తోనే ముగిసింది. ఈ విషయం నన్ను కూడా  కొద్దిగా   బాధించింది. ఇకపోతే చదువంటే నాకు పంచ ప్రాణాలు,  పుస్తకాల  పురుగు అనికూడా మరో పేరు వుండేది బడిలో. 


             నా  విద్యాభ్యాసం విజయవాడ ప్రక్కన ఏలూరులో ప్రారంభమయింది. బాల్యం కూడా అక్కడే గడిచింది. నా ఒకటవ తరగతి  టీచర్ పేరు 'పద్మావతి'. ఆమె పేరు, ఆమె మొహం కుడా నేనింకా మరిచి పోలేదు. ఎందుకంటే  ఆవిడ  ఇల్లు మా ఇంటి ప్రక్కనే ఉండేది  గనుక. 

                అన్నట్లు అమ్మానాన్న గురించి  చెప్పలేదు  కదు. వాళ్ళ పేర్లు పరిచయం చేశాను కాని  వాళ్ళ గురించి చెప్పనే లేదు. అమ్మ ఇంట్లోనే వుండేది. నాన్న ఇస్త్రీ పని. నేనెప్పుడు దాని కోసం బాధపడింది లేదు.  మాది ఒక మధ్య తరగతి కుటుంబం. 



                     చిన్నప్పుడు నేను చాలా  చలాకీగా ఉండేవాన్ని.ఎందుకో బంధువులు అందరూ మద్రాసులో ఉండటంతో మా  అమ్మానాన్న కూడా మద్రాసులో జీవించేందుకు సిద్ధపడ్డారు. దానితో నా చిన్నప్పుడే మద్రాసు ప్రయాణమయ్యాము.

                       నా ఎనిమిదవ  ఏట  అంటే 1997 సెప్టెంబర్ 5 న, ఎవరో మహానుభావురాలు  చనిపోయింది   అని అన్ని టివి లలోనూ చూపించసాగారు. ఆ చనిపోయిన వ్యక్తి  ఎవరో కాదు.  నేను నా జీవితంలో ఎంతగానో ఆరాధించే 'మదర్  తెరెసా' ఆమె. అప్పుడు నాకు ఊహ తెలియక ఆ విషయాన్ని ఆకతాయిగా వదిలేసాను.  ఇప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చిన ప్రతీసారి బాధనిపిస్తుంది.  

No comments:

Post a Comment